Adhika Masa sankashtahara Chaturthi Vrata Katha - అధిక మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ

Adhika Masa sankashtahara Chaturthi Vrata Katha - అధిక మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ
Adhika Masa sankashtahara Chaturthi Vrata Katha - అధిక మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ

(వ్రతము చెయుచున్న సంవత్సరమున మాసము అధికముగ వచ్చినను, ఆమాసమున కథనే చదువవలెను)

కుమారస్వామి ఋషులతో "మహర్షులారా! పాండవులు శ్రీ కృష్ణభక్తులు, ధర్మ పరాయణులు, ఒకనాడు పాండవులకడకు వేదవ్యాసమహర్షి రాగా, వారెల్లరు వ్యాసునికి సాష్టాంగముగ నమస్కరించిరి. అంతట ధర్మరాజు "ఋషీశ్వరా! మీ దర్శన భాగ్యమున మాజన్మ ధన్యమైనది. మీ కృపవలన మేము క్షేమముగానున్నాము" అని విన్నవించగా, భీమసేనుడును కుశల ప్రశ్నలు గావించి, తన సంతోషమును వెల్లడించెను. పిదప వ్యాసునికి అర్ఘ్యపాద్యములను ఇచ్చిరి. వనవాసకృశాంగియగు ద్రౌపదియు వ్యాసునికి నమస్కరించి, కుశలప్రశ్నలు గావించెను. పిదప ధర్మరాజు వ్యాసభగవానునితో "ఋషివర్యా! మాకు కష్టములు తొలగి, శత్రుబాధలు నశించి, శీఘ్రముగ రాజ్యము నొంది, సుఖించునుపాయమును అనుగ్రహింపుము" అని ప్రార్థించెను.

            అంతట వేదవ్యాసుడు "ధర్మరాజా! ఈ లోకమున నీయంతటి ధర్మాత్ముడు లేడు. కనుక సర్వకార్యములను సాధించునది, దుఃఖములను నివారించునది యగు నొక్కవ్రతమును దెల్లెదను, భక్తిశ్రద్దలతో ఆచరింపుము. దీని ఆచరించినచో విద్యార్థికి విద్య, ధనార్థికి ధనము, విజయార్థికి విజయము చేకూరును. ఎవరెవరు ఏదేది కోరుదురొ అదెల్లను సిద్దించును.

            పూర్వము కృతయుగమున చంద్రసేనుడను పేరుగల రాజు గలడు. అతడు మహాదాత, బుద్దిమంతుడు, అతనికి రత్నావళియను పేరుగల భార్యగలదు. ఆమె పరమసాధ్వి గుణవతి, ఇట్లుండగా ఒకప్పుడు శత్రువులు వీరి రాజ్యముపై దండెత్తి, సైన్యములను వశపరచుకొనిరి. దీనితో చంద్రసేనుడు రాజ్యభ్రష్టు డయ్యెను. పిదప భార్యయగు రత్మావళిని వెంట పెట్టుకొని, అరణ్యములందు తిరుగుచు, ఒకచోట మార్కండేయ మహర్శిని దర్శించెను. రాజదంపతులు ఆ మునిశ్వరుని సాష్టాంగ నమస్కారము లొనర్చిరి. అంతట రాజు "మహాత్మా! గడవిన జన్మమున నేను ఏపాపము చేసితినో ఇప్పుడు రాజ్యమును కోల్పోయి, అరణ్యములందు తిరుగుచున్నాను. నన్ను కరుణించి, రక్షింపుడు "అని ప్రార్థించగా, మార్కెండేయ మహర్షి, "రాజా! నీజన్మాంతర కర్మవిశేషమును చెప్పెదని వినుము. నీవు ఒకనాడు అరణ్యమున సంచరించుచు, ఒక సరోవరతీరమున గణేశ వ్రతమును జేయుచున్న కన్యను జూచి, "కన్యలారా! మీరు గావించు వ్రతమేమి? ఎట్లు ఆచరించవలెను? ఫలమేమి? అని ప్రశ్నించితివి. వారు తాము చేయుచునది గణేశవ్రత మనియు, అధికమాసమున కృష్ణ చతుర్థీనాడు చంద్రోదయ కాలమున కష్టనివారణార్థమై ఈ వ్రతమును చేయుచున్న మనియు. గణపతి ఈ దినమున పంచామృతములతో అభిషేకించి, గంధపుష్పాక్షలతో పూజించి, బిల్వదూర్వాయుగ్మములు సమర్పించి, 21 కుడుములు, నివేదించి, బ్రహ్మణునికి దానమీయవలె ననియు, పిదప పురాణాంతర్గత కథను చదివి, గణపతికి నమస్కరించి, ప్రసాదము స్వీకరించవలెనని వివరించిరి. ఆనాడు వారినుండి ఆవ్రతమును స్వీకరించి, నీవును గణపతిని చక్కగా పూజించితివి, అందులకు సంతోషించిన గణపతి నీకు ధనధాన్యపుత్రపౌత్రాది సంపదల నిచ్చి, అనిగ్రహించెను. కొన్నాళ్ళ తరువాత, సంపన్నాంధుదవై నీవు ఆవ్రతమును చేయుట మానితివి. కొంతకాలము చేసిన మహిమచే ఈ జన్మమునను రాజువైతివి. కాని వ్రతమును మరచినందున ఇట్టి దుష్పలము పొందితివి. కనుక ఆ గణేశుని మరల పూజించి, ఇష్టార్థసిద్ధి పొందుము" అని వివరించెను.

అంతట చంద్రసేనుడు ఆ అరణ్యముననే గణేశపూజను శక్త్యనుసారము గావించెను, అంతట వ్యాసుడు సంకష్టహర చతుర్థీ వ్రతమును ఆచరింపుము. అన్నియు అనుకూలించును. రాజ్యము లభించును, " అని చెప్పగా, ధర్మరాజు సోదరులతోగూడి, సంకష్టహర చతుర్థీవ్రతమును ఆచరించి, గణపతి అనుగ్రహమున శత్రువులను జయించి, మహాసామ్రజ్యమునకు చక్రవర్తియై సుఖించెను" అని చెప్పెను.

ఇట్లు వ్యాసయుధిష్టిర సంవాదమున అధికమాసమున ఆచరించు , సంకష్టహర చతుర్థీవ్రత కథ సమాప్తము

 

"మంగళం విఘ్నరాజాయ మంగళం భవ్యమూర్తయే

మంగళం సర్వవంద్యాయ మంగళం హరసూనవే

"వినా విఘ్ననాథం సనాథో సానాథః

సదా విఘ్ననాథం స్మరామి స్మరామి

ప్రభో!  విఘ్ననాథా!ప్రసీద ప్రసీద

ప్రియం విఘ్ననాథ!ప్రయచ్చ

శ్రీ మహాగణపతి ప్రసాదసిద్ది రస్తు

సర్వే జనాః సుఖినో భవంతు

ఓం శాంతి శాంతి శాంతిః

 

చైత్ర మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ