Pushyamasa Sankashtahara Chaturthi Vrata Katha - పుష్యమాస సంకష్టహర చతుర్థి వ్రత కథ
Pushyamasa Sankashtahara Chaturthi Vrata Katha - పుష్యమాస సంకష్టహర చతుర్థి వ్రత కథ |
పార్వతీదేవి గణపతిని "గణపతీ! పుష్యమాసమున ఆచరించు సంకష్టహర గణపతి వ్రత విశేషములను
వివరింపుము" అని కోరగా, గణపతి ఇట్లు వివరించెను.
"అమ్మా!
హిమవత్పుత్రీ! పుష్యమాసమున నన్ను "లంబోదరుడు" గా భావించి, పూజించవలెను. ఈ రొజు కెవలము గోపంచితము (గొమూత్రము) మాత్రము సేవించి, జాగరణము చేయవలెను. కుడుములతో, నేయితో హోమము గావించవలెను. ఇట్లు చేసినచో రాజు, అధికారులు తన వశమగుదురు. ఈ విషయమై జరిగిన కథను తెల్పెదను వినుము.
పూర్వము దేవతలను జయించిన రావణుడు గర్వముతో కన్నుగానక, సముద్రతీరమున సంధ్యావందనము గావించుచున్న వాలిని పట్టుకొనెను. మహాబలుడగు వాలి రావణుని జూచి, నవ్వుచు, వానిని చంకలో ఇరికించుకొని, ఆకాశమార్గమున పయనించి, కిష్కంధ జేరెను. అచ్చట రావణుని మెడకు త్రాడుగట్టి, తనకుమారుడైన అంగదునికి ఆటవస్తువుగా ఇచ్చెను. కిష్కమ్ధా వాసులెల్లరును వచ్చి, రావణుని జూచి , నవ్వుకొనుచుండిరి. దీనితో రావణాసురుని గర్వము అహంకారము తగ్గినవి. సిగ్గుతో బాధపడినవాడై, తన తాతయగు పులస్త్యుని స్మరించెను. అంతట పులస్త్యుడు సాక్షాత్కరించి రావుణునితో "పుత్రా! రావణా! నీకు ఈస్థితి ఎట్లు కలిగెను? గర్వము చేతనే రాక్షసులు, మానవులు పతనము నొందుదురు. ఇప్పుడు నన్నేల తలంచితివి?" అనగా రావణుడు "తాతా! నేను దేవతలను జయించితి నన్న గర్వముతో, సంధ్యావందనము చేయుచున్న వాలిని పట్టుకొంటిని. అతడు నన్ను చంకలో ఇరికించుకొని, కిష్కంధకు తెచ్చి, మెడకు త్రాదుగట్టి, తనకుమారునికి ఆట వస్తువుగా ఇచ్చెను. ఇచ్చటివారెల్లరు
నన్ను వింతజివిగా చుచి, నవ్వుచున్నారు. ఈ స్థితిలో ఏమి చేయవలెనో తెలియకున్నది. కనుక మిమ్ము స్మరించితిని" అని పులస్త్యబ్రహ్మతో చెప్పగా, అతడు " రావణా! నీకు బంధవిముక్తి కల్గును. కాని దశరథపుత్రుడైన శ్రీరామునిచే నీకు మరణమున్నది.
ఇప్పుడు ఈ బంధము నుండి వుముక్తడ వగుటకై శ్రీ సంకష్టహర
చతుర్థీ వ్రతమును
ఆచరింపుము. మునుపు దేవేంద్రుడును ఈ వ్రతమును ఆచరించి, ఆపదల నుండి తప్పించుకొనెను. కనుక నీవును ఈ వ్రతమును తప్పక ఆచరింపుము. శుభము కల్గును" అని విధివిధానములను తెల్పి అంతర్థానము నొందెను.
పిదప రావణుడు మాయాబలమున అన్నియు సమకూర్చుకొని, సంకష్టహర గణపతి చతుర్థీ వ్రతమును
నిర్వర్తించి గణపతి దయవలన వాలి
కరుణించగా బంధవిముక్తుడై లంకను జేరి, రాజ్యము పొంది, సుఖించెను" అనెను.
ఇట్లు శ్రీ కృష్ణ యుధిష్టిర సంవాదాత్మకమై శ్రీ సంకష్టహర చతుర్థీ వ్రతకల్పమున పుష్యమాస కథ సమాప్తము
"అనేకదం తం భక్తానాం ఏకదంత ముపాస్మ హే"
శ్రీ మహాగణపతి ప్రసాదసిద్ధి రస్తు
"శుభం
భవతు"
ఓం శాంతి శాంతి శాంతిః
0 Comments