Ashada Masa sankashtahara Chaturthi Vrata Katha - ఆషాడమాస మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ

Ashada Masa sankashtahara Chaturthi Vrata Katha - ఆషాడమాస మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ
Ashada Masa sankashtahara Chaturthi Vrata Katha - ఆషాడమాస మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ

పార్వతీదేవి, గణపతిని "గణపతీ! ఆషాడమాసములో సంకష్టహర చతుర్థీ వ్రతమును ఆచరించు విధానమును, ఫలములను వివరింపుము" అని కోరగా గణపతి ఇట్లు తెల్పెను.

"అమ్మా! లలితాదేవీ! ఆషాడమాసమున సంకష్టహర గణపతి వ్రతము సర్వపాపహరము సకల కార్య సిద్ధిదము విఘ్ననివారకము. ఈ మాసమున నన్ను "విఘ్నరాజు" పేరున పూజించవలెను. ఈ మాసమున బిల్వదళములతో, దూర్వాయుగ్మములతో, ఏకవింశతి (21)  పత్రములతో నన్ను పూజించి, మోదకములు (కుడుములు) నివేదించవలెను. ఈ విషయమై ప్రాచీన కథ గలదు చెప్పెదను వినుము.

పూర్వము ద్వాపరయుగమున ’మాహిష్మితి’  అను పేరుగల పట్టణము గలదు. అందు "మహిజేతనుడు" అను రాజు గలడు. అతడు ప్రజలను కన్నబిడ్డలవలె పాలించువాడు. ధర్మాత్ముడు. అయినను అతనికి సంతానము లేదు. "అపుత్రస్య గతిర్నాస్తి" అని శాస్త్రములు చెప్పినందున, వివేకియగు రాజు తన సంతానహీనతను తలంచి, మిక్కిలి బాధపడుచుండెను. "ఔరా! నాస్థితి చూచి, నా తల్లిదండ్రులు కన్నీటితో నేనిచ్చు తర్పణ జలమును స్వీకరింతురు గదా! నాకు ఉత్తమగతి లేదు. నేనెవ్వరికిని ద్రోహము చేయలేదు. ఎన్నడును ధర్మమును తప్పలేదు. దేవబ్రాహ్మణ గోపూజలు నిరంతరము  నిర్వహించుచున్నాను. అయినను నాకు సంతాన ప్రాప్తిలేదు. ఆశ్చర్యము!" అని చింతించి, తపస్సు గావించుటకై అడవులకు వెళ్ళెను. మార్గమాధ్యమున "రోమశు" డను మహర్షిని దర్శించి, వారికి తన మనోవ్యథను వివరించి, తన కేదైన మంచి వ్రతమును ఉపదేశించి, సంతానఫలము చేకూరునట్లు అనుగ్రహింపు మని ప్రార్థించెను. రోమస మహర్షి రాజును కరుణించి, "రాజా! వ్రతములలో నెల్ల ఉత్తమమైన వ్రతము సంకష్టహర చతుర్థీ వ్రతము. మీ దంపతులు ఈ వ్రతమును ఆచరించినచో, తప్పక సంతానము కలుగును." అని చెప్పెను.

అంతట ఆ రాజదంపతులు మహర్షి చెప్పిన ప్రకారము శాస్త్రోక్తముగ సంకష్టహర చతుర్థీ వ్రతమును ఆచరించి, గణపతిని పూజించి, కుడుములు నైవేద్యము గావించి, చంద్రార్ఘ్యముగావించి, కథను చదివి, ప్రసాసము గైకొనిరి.

గణపతి అనుగ్రహమున వారికి ఒక కుమారుడు కల్గెను. దీనిచే తన జన్మ సార్థకమైనదని ఆ దంపతులు తలంచి, మహానందభరితులై, బీదలకు, వస్త్ర వస్తు దానములు గావించిరి. నాటినుండి ప్రతిమాసము బహుళ చతుర్థీ దినమున ఆ రాజదంపతులు సంకష్టహర గణపతి వ్రతమును ఆచరించుచుండిరి. తత్ఫలముగా చిరాకాలము భోగభాగ్యములతో హాయిగా కాలము గడిపిరి.

కనుక ఓ ధర్మరాజా! నీవును ఈ వ్రతమును ఆచరించి, గణపతి అనుగ్రహమున రాజ్యము పొంది, సుఖింపుము అని హితము చెప్పెను."

ఇట్లు కుమారస్వామి శైనకౌది మహర్షులకు సంకష్టహర చతూర్థీవ్రత విశేషములను వివరించెను.

ఇట్లు శ్రీకృష్ణయుధిష్ఠిర సంవాదాత్మకమగు శ్రీ సంకష్టహర చతుర్థీ వ్రతమున ఆషాఢమాస వ్రతకథ సమాప్తము.

"ఆషాఢాజినభూషాఢ్యా! విఘ్నరాజా! నమామ్యహమ్!

బ్రహ్మచర్య వ్రతారాధ్య! భుక్తిం ముక్తిం ప్రదేహి మే"

శ్రీ విఘ్నరాజ ప్రసాద సిద్ది రస్తు

సర్వే జనాః సుఖినో భవంతు

ఓం శాంతిః శాంతిః శాంతిః

జ్యేష్టమాస మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ