Jyeshta Masa sankashtahara Chaturthi Vrata Katha - జ్యేష్టమాస మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ
Jyeshta Masa sankashtahara Chaturthi Vrata Katha - జ్యేష్టమాస మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ |
శ్రీ ఆఖువాహనాయ
నమః
పార్వతీదేవి, గణపతిని
"గణపతీ! జ్యేష్టమాసమున
సంకష్టహర చతుర్థీ వ్రతమును ఆచరించు
విధానమును, ఫలములను వివరింపుము" అని కోరగా గణపతి పార్వతీదేవితో "అమ్మా! శ్రీమాతా! జ్యేష్టమాసమున జ్యేష్టరాజగు సంకష్టహర
గణపతిని పూజించుట వలన సర్వసౌబాగ్యములు చేకూరును. స్త్రీలు దీర్ఘ సౌమంగల్యముతో సుఖింతురు.
ఈ మాసమున మూషిక వాహనుడైన గణపతిని బిల్వపత్రములతో
పూజించి, రక్తవస్త్రములతో (ఎర్రని) అలంకరించి, ఫలములను నివేదించవలెను. ఈ నెలలో నన్ను
"ఆఖువాహనుడు" గా భావించి, పూజించవలెను.
(ఆఖువాహనుడు - ఎలుకను వాహనముగ గలవాడు) ఈ విషయమై
పురాణప్రసిద్ధమైన కథ గలదు. చెప్పెదను వినుము.
పూర్వము కృతయుగమున ’వృథువు’ అను పేరు గల చక్రవర్తి గలడు. అతని రాజ్యమున
’దయా దేవుడు’ అను ఒక బ్రహ్మణుడుండెను.
అతనికి నలుగురు కుమారులు గలరు. తగిన వయస్సున వారు వివాహితులైరి. అంతట పెద్ద కోడలు అత్తతో
"అమ్మా! మా పుట్టినింట ప్రతిమాసమున బహుళ చతుర్థినాడు
శ్రీ సంకష్టహర గణపతి వ్రతమును
చేయుచుంటిని, కనుక ఇక్కడను ఆ వ్రతమును జేయుటకు
నన్ను అనుమతింపుడు" అని అర్థించెను.
ధనమదాంధురాలగు అత్త "అమ్మాయు! మనయింట దారిద్ర్యము లేదు. సకల సంపదలు
తులతూగుచున్నవి. హాయిగా అనుభవింపుము. ఆ వ్రతమును
చెయవలసిన అవసరమేమున్నది? అని, ఆమె కోర్కను తిరస్కరించెను.
కొన్నాళ్ళకు పెద్దకోడలు గర్భవతియై ఒక చక్కని మగ బిడ్డను ప్రసవించెను. ఆ బాలుడు పెరిగి, పెద్దవాదై యుక్తవయస్కుడు కాగా, యోగ్యయగు కన్యతో అతనికి వివాహము నిశ్చయించిరి. లగ్నకాలమున గణపతి పెండ్లికొడుకును అదృశ్యుని జేసెను. వరునకై సర్వత్ర వెదికి, ఎల్లరును నిరాశతొ దిగిలు చెందిరి.
అంతట వరుని తల్లి (పెద్దకొడలు), అత్తతో "అత్తా! నేను ఈ యింట సంకష్టహర గణపతి వ్రతము చేయుదుననగా, వలదంటివి.
ఈ కారణముననే గణపతి కోపించి, పెండ్లిపీటలపై నున్న నాకుమారుని అదృశ్యుని జేసెను. ఇదంతయు ఆ స్వామి మాయయే!"
అని బోరున విల్లపించెను.
అత్త పరిస్థితిని గమనించి, కోడలు
మాట విని, కో్డలితో గూడి శ్రీ
సంకష్టహర గణపతి వ్రతమును ప్రతి మాసమున ఆచరించసాగెను.
(కొన్నాళ్ళకు) ఒకనాడు వ్రత సమయమున ఒక బిక్షకుడు రాగా అతనికి
అతిథి మర్యాదలు గావించి, భోజనము పెట్టిరి, అందులకు సంతసించిన ఆ భిక్షకుడు "అమ్మా! మీరు
కోరిన వర మిచ్చెదను అర్థింపుడు" అనినంత, కోడలు "మహాత్మా! పెండ్లి పీటలపై
మాయమైన నాకుమారుని రప్పించి, నామనోవ్యథ దీర్చుము" అని ప్రార్థంచగా, అతడు కరుణించి, "మీ కుమారుడు శీఘ్రముగా రాగలడు, బాధ పడవలదు " అని చెప్పి వారు చూచుచుండగానే అదృశ్యుడయ్యెను. ఆ యిరువురు "ఇదంతయు ఆ గణపతి దేవుని అనుగ్రహమే" అని ఆశ్చర్యపడిరి.
అతడట్లు వెళ్ళిన పిదప, అడవిలో ఒంటరిగా
తిరుగుచున్నాడని, ఒకడు ఆ బ్రాహ్మణ యువకుని తీసుకొని వచ్చి, పురప్రజలకు చూపగా, వారు ఇతడు ఆనాడు కళ్యాణ మంటపమున అదృశ్యుడైన
బ్రాహ్మణ వరుడే యని నిశ్చయించి,
వారికీ వార్త తెల్పిరి. తల్లిదండ్రులు, పెద్దలు వచ్చి చూచి తమవాడే యని గుర్తించి. అతనిని
పిల్చుక వచ్చిన వ్యక్తిని ప్రశంసించి, అతనికి నూతన వస్త్రములు ఆభరణములు, గోవును, ఇచ్చి,
కృతజ్ఞతలు తెల్పిరి. పిదప ఎల్లరును శ్రీగణపతి దేవుని మహిమను కొనియాడిరి. అంతట కన్యాదాతకు ఈ వార్తతెల్పి, వారిని రప్పించి,
ఒక శుభముహుర్తమున మున్నటి కల్యాణమంటపముననే శాస్త్రోక్తముగ వివాహము గావించిరి. నాటినుండి
ఇతని భార్యయు ప్రతిమాసమునకు శ్రీ సంకష్టహర చతూర్థీ వ్రతమును భక్తిశ్రద్ధలతో
భర్తతో గూడి ఆచరించుచు ఉత్తమ సుఖములతో దీర్ఘసుమంగళియై వర్థిల్లెను.
కనుక తల్లీ! ఈ వ్రతము సకలవాంఛలను సిద్ధింపజేయును.
విఘ్నములను నివారించును.
నీవును ఈ వ్రతము ఆచరించి, శివానుగ్రహము పొందుము" అని వివరించెను.
ఇట్లు శ్రీ కృష్ణయుధిష్టిర
సంవాదాత్మకమైన శ్రీ సంకష్టహర చతుర్థీ వ్రతమున జ్యేష్ఠమాసవ్రత కథ సమాప్తము.
"జ్యేష్టరాజ! నమ స్తుభ్యం,
నమో మూషక వాహన! సౌభాగ్యం దేహి మే దేవ! జగజ్జీవవకారణ!
"క్షేమం
కరాయా దేవాయ, సర్వమంగళ మూర్తియే
నమో విఘ్నవినాశాయ,
జ్ఞాన విజ్ఞాన దాయినే"
శ్రీ మహా గణపతి ప్రసాద సిద్ది రస్తు
సర్వే జనాః సుఖినో భవంతు
ఓం శాంతిః శాంతిః శాంతిః
వైశాఖ మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ
0 Comments