Shravana Masa sankashtahara Chaturthi Vrata Katha - శ్రావణ మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ

Shravana Masa sankashtahara Chaturthi Vrata Katha - శ్రావణ మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ
Shravana Masa sankashtahara Chaturthi Vrata Katha - శ్రావణ మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ

శ్రీ మహాగణాధిపతయే నమః

            మహర్షు లెల్లరు కుమారస్వామిని "దేవా! దారిద్ర్యము, దుఃఖము, శత్రుబాధ మున్నుగునవి తొలగి, సమస్త మంగళములు సిద్దించి, మానవులు సుఖశాంతులతో నుండుటకై ఆచరింప దగిన ఉత్తమ వ్రతమును" ఉపదేసింపుడు అని ప్రార్థింపగా, కుమారస్వామి వారితో "మునులారా! సర్వార్థసాధకము" సకల క్షష్టనివారకము, మంగళప్రదము" శీఘ్రసిద్ధి కరము అగు ఒక్క పుణ్యవ్రతము గలదు. అది "సంకష్టహర చతుర్థీ వ్రతము" ఇది గణపతికి సంబంధించినది. వ్రతమును శ్రావణ బహుళ చతుర్థి నాటి రాత్రి, చంద్రోదయకాలమున ఆచరింవలెను. పిదప ప్రతిమాసమునను బహుళ చతుర్థినాడు (అధికమాసముతో గూడ) నియమవంతులై సంకష్టహర గణపతిని కల్పోక్తముగా పూజించవలెను. పూర్వము ధర్మరాజు శ్రీకృష్ణుని వలన వ్రతము తెలిసికొని, ఆచరించి, సర్వశుభములను పొంది సుఖించెను. ఉపదేశమునే మీకును తెల్పెదను వినుడు.

            మునులారా! హిమవంతుని పుత్రిక పార్వతీదేవి పరమశివుని వివాహమాడగోరి, తీవ్రముగా తపస్సు చేయసాగెను. మెదట గణపతిని స్మరించి, పిదప పంచాక్షరీ మంత్రమును జపించుచుండెను. ఇట్లుండ గణపతి ప్రత్యక్షమై "అమ్మా! నీ మనోరథ మేమి " నీవు కోరిన వరమిత్తును కోరుము" అనగా, పార్వతి గణపతీ! నేను శివుని పెండ్లి చేసికొనదలచితిని, కనుక నాకోరిక శీఘ్రముగ నెరవేరుటకై ఏదైన మంచి వ్రతమును ఉపదేసింపుము అని అర్థించెను.

            అంతట మహాగణపతి, పార్వతితో "అమ్మా! వ్రతములలో నెల్ల ఉత్తమమైన "సంకష్టహర చతుర్థీ వ్రతము" గలదు. దీనిని శ్రావణ బహుళ చతుర్థి (చవతి) నాడు ప్రారంబీంచి, 24 సంవత్సరములు చేయవలెను. శక్తిలేనిచో కనీసము కనీసము 24  నెలలైనను( 2 సంవత్సరములు) చేయవలెను. వ్రతము చేయునాడు శిరస్నానము చేసి, ఉపవాస ఉండవలెను. నిర్మలమైన మనస్సుతో నన్ను ధ్యానించి, పంచామృతములతో అభిషేకించి, కల్పోక్తముగా పూజించి, నాకు ఇష్టములైన భక్ష్యభోజ్యములను నాకును చంద్రునికిని అర్ఘ్యప్రదానము కావింపవలెను. 1008 లేక 108  సమిధలతో నన్ను గూర్చి హోమము చేయవలెను. పిదప బంధువులతో గూడి, భుజించవలెను. ఈ వ్రతమును దంపతులుగనే ఆచరించవలెను. కార్యార్థిలైన వారు, బ్రహ్మచారి, కన్య, విద్యార్థి విడిగానైనను పూజించి కార్యసిద్ధి పొందవచ్చును. ఇట్లు నన్ను భక్తిశ్రద్ధలతో కల్పోక్త ప్రకారముగ పూజించిన వారికొ అన్ని కోరికలను తప్పక నెరవేర్తును. కనుక అమ్మా! నీవును ఈ వ్రతమును ఆచరించి, మనోరథసిద్ధి పొందుము" అని వివరించెను.

ఇట్లు గణపతిచే ఉపదేశము పొందిన పార్వతిదేవి, ఈ సంకష్టహర చతుర్థీ వ్రతమును ఆచరించి, పరమశివుని పెండ్లాడి, సర్వమంగళయై,  సుఖించెను. అహల్య ఈ వ్రతము చేసి, సాప విముక్తి పొందెను. శ్రీ రాముడును ఈ వ్రతమును యథాశాస్త్రముగా ఆచరించి, వనవాసాది కష్టముల నుండి గట్టెక్కి, రాజ్యము పొంది సుఖించేను" అని శ్రీ కృష్ణుడు ఉపదేశింపగా ధర్మరాజు అట్లే ఆచరించి, రాజ్యాది లాభము పొంది, తమ్ములతో, భార్యలతో గూడి సుఖించెను.

ఇట్లు శ్రీ కృష్ణ ధర్మరాజు సంవాదాత్మకమగు శ్రావణమాస సంకష్టహర చతుర్థీ వ్రత కథ సమాప్తము.

శ్రీ మహాగణప్తి ప్రసాదసిద్ధి రస్తు

ఓం శాంతి శాంతిః శాంతిః

"సర్వే జనా స్సుఖినో భవంతు"

ఆషాడమాస మాస సంకష్టహర చతుర్థి వ్రత కథ